Homeతెలంగాణరుణమాఫీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన హరీశ్ రావు.. రైతుల పక్షాన న్యాయపోరాటం

రుణమాఫీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన హరీశ్ రావు.. రైతుల పక్షాన న్యాయపోరాటం

రుణమాఫీ కాని రైతుల పక్షాన మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అన్యాయానికి గురైన రైతుల ప్రయోజనాల కోసం ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో రుణ మాఫీకి అర్హులైన రైతులు మొత్తం 43,363 మంది ఉన్నారని గణాంకాలను వివరించారు. వీరిలో కేవలం 20,514 మంది (47 శాతం) మాత్రమే రుణమాఫీ ప్రయోజనం పొందారని మిగిలిన 22,849 మంది రైతులు ఇంకా నిధుల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో రైతులను ప్రభుత్వం వంచిస్తోందని ఆయన మండిపడ్డారు.

రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి అనేక షరతులు విధించిందని హరీశ్ రావు విమర్శించారు. రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న అప్పులను రైతులు ముందుగా చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పిన మాట నమ్మి ఎంతోమంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ అదనపు మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించినట్లు గుర్తు చేశారు. తీరా రైతులు తమ వంతు వాటా కట్టిన తర్వాత ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ఇది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల బ్యాంకుల నుంచి రైతులపై ఒత్తిడి పెరుగుతోందని హరీశ్ రావు వెల్లడించారు. అప్పు తీరకపోవడంతో వడ్డీల భారం పెరిగిపోయి రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం తాను హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ సొమ్మును జమ చేయాలని కోరుతూ పిటిషన్‌లో విన్నవించినట్లు తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బ్యాంకుల వేధింపుల నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు. రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని సూచించారు. హైకోర్టు ద్వారా బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల గొంతుకగా తన పోరాటం కొనసాగుతుందని రాజీలేని పోరాటమే తన లక్ష్యమని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ALSO READ: కేసీఆర్ ఎందుకు బయటకు వస్తున్నారంటే..? కోదండరాం సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు