Homeతెలంగాణరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా.. అసలు నిజాలు చెప్పేసిన కిషన్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా.. అసలు నిజాలు చెప్పేసిన కిషన్ రెడ్డి

రాష్ట్రంలో గతంలో గ్యాస్ ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం దిల్ కుషా గెస్ట్ హౌస్ వేదికగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. కొంతమంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా ధరలు పెరుగుతాయని తప్పుడు ప్రచారం చేయడం వల్లే ప్రజల్లో భయం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆందోళనతోనే వినియోగదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నట్లు విశ్లేషించారు. అవసరానికి మించి ఇళ్లలో నిల్వ చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత కష్టతరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ సరఫరా గణాంకాలను వివరిస్తూ సాధారణంగా రోజుకు 6,400 కిలోలీటర్ల సరఫరా జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ దృష్ట్యా దానిని 10,300 కిలోలీటర్లకు పెంచినట్లు వివరించారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా ఉండే 3,200 కిలోలీటర్ల సరఫరాను 6,400 కిలోలీటర్లకు పెంచామని చెప్పారు. డీజిల్ విషయంలో సాధారణంగా ఉండే 8 వేల కిలోలీటర్ల సరఫరాను ప్రస్తుతం 15,500 కిలోలీటర్లకు పెంచినట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కోటాను 19,300 కిలోలీటర్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,325 పెట్రోల్ పంపుల్లో కేవలం 106 పంపుల్లో మాత్రమే తాత్కాలికంగా స్టాక్ సమస్య కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అది కూడా రవాణా ఆలస్యం ముందస్తు చెల్లింపులు చేయకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్లే తలెత్తిందని వివరించారు. మన దేశం పెట్రోలియం ఉత్పత్తుల కోసం 88 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతోందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఎక్కడా కొరత రాకుండా ముందస్తు దిగుమతులు చేసుకుంటోందని భరోసా ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేవలం అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని కోరారు.

ముఖ్యంగా వేసవి కాలం కావడంతో ఇళ్లలో పెట్రోల్ నిల్వ చేయడం ప్రమాదకరమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇది అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బల్క్ వినియోగదారులు రిటైల్ బంకుల వద్ద కొనుగోలు చేయకుండా నేరుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ ఇవ్వాలని కోరారు. అటువంటి వారికి 24 గంటల్లో సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆటో ఎల్పీజీ సరఫరాలో ప్రభుత్వ కంపెనీల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏవైనా సమస్యలుంటే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

ALSO READ: వికలాంగుల పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు