Fake Evidence in Divorce Case: ఒక మహిళ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి విడాకులు పొందిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని చూపించేందుకు, అతడి సొంత చెల్లిని రెండో భార్యగా చూపిస్తూ సాక్ష్యాలు సమర్పించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన భర్త, ఆ తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.
అసలేం జరిగిందంటే?
గ్వాలియర్‌కు చెందిన ఈ దంపతులు 1998లో వివాహం చేసుకున్నారు. భర్త ఉద్యోగ కారణాల వల్ల తరచూ ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో, ఇద్దరి మధ్య క్రమంగా విభేదాలు పెరిగాయి. 2015 నుంచి వారు వేర్వేరుగా జీవించడం ప్రారంభించారు. ఈ సమయంలో మహిళ పలుమార్లు విడాకులు కోరినా, భర్త అంగీకరించలేదని తెలుస్తోంది. 2021లో భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ఆధారంగా ఒక ఫొటోను సమర్పించింది. ఆ ఫొటోలో భర్తతో పాటు అతని చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ చిత్రాన్ని ఆధారంగా తీసుకున్న కోర్టు, భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భావించి ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
అసలు నిజం తెలియడంతో..
అయితే, ఇటీవల ఆ ఫొటో విషయంపై నిజం బయటపడింది. అందులో ఉన్న మహిళ భర్త చెల్లి అని తెలిసిన తర్వాత, తాను మోసపోయానని భావించిన భర్త వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ముందు ఈ కేసు విచారణకు రానుంది. తప్పుదారి పట్టించే సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందో ఈ కేసుతో తేలింది. ఆమెపై న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.