Homeఅంతర్జాతీయంJaishankar: ఇరాన్ సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థపై జైశంకర్ షాకింగ్ కామెంట్స్!

Jaishankar: ఇరాన్ సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థపై జైశంకర్ షాకింగ్ కామెంట్స్!

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ సంక్షోభం నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అబుదాబిలో పర్యటిస్తున్న ఆయన.. అక్కడి రాజ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో పాటు, యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులపై ఆయన విస్తృతంగా స్పందించారు.

మోదీ నిర్ణయాలతో తప్పిన పెను ప్రమాదం

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని పెద్ద ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడాయని జైశంకర్ చెప్పారు. ఇతర నాయకత్వం ఉంటే పరిస్థితులు మరింత విషమించి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో గల్ఫ్ దేశాలతో సంబంధాల విషయంలో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంబంధాలు మరింత బలపడ్డాయని తెలిపారు.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలు భారత అవసరాలను గుర్తించి సహకరించే స్థాయికి వచ్చాయని జైశంకర్ వెల్లడించారు.  మోదీ ప్రభుత్వం తీసుకున్న విదేశాంగ విధానాల ఫలితమని ఆయన అన్నారు. ఇరాన్ సంక్షోభం ప్రభావంతో విమాన రవాణా రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఈ కారణంగా టికెట్ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని సూచించారు. అయితే, భారతీయుల భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాలతో సమన్వయం చేసుకుంటూ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

సప్లై చైన్ వ్యవస్థపైనా యుద్ధ ప్రభావం

ఇంకా,  సప్లై చైన్ వ్యవస్థపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడిందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశమని జైశంకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, భారత దౌత్య విధానం ద్వారా ఈ ప్రభావాన్ని పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు