Homeతెలంగాణరహదారులపై మృత్యుపాశాలుగా 'వడ్ల' దిబ్బలు...!

రహదారులపై మృత్యుపాశాలుగా ‘వడ్ల’ దిబ్బలు…!

వాహనదారులకు మృత్యుపాశాలుగా ధాన్యం కుప్పలు

​నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): చండూర్ కనగల్ మార్గంలో ప్రయాణం ఇప్పుడు ప్రాణాలతో చెలగాటంగా మారింది. కురంపల్లి నుండి కనగల్ వరకు ప్రధాన రహదారి పొడవునా, రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పలు వాహనదారులకు ఇబ్బందులుగా మారాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను, ఆరబెట్టుకోవడానికి సరైన కల్లాలు లేక, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించక, రైతులు అనివార్య పరిస్థితుల్లో రోడ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే రహదారికి ఇరువైపులా, కొన్ని చోట్ల ఏకంగా రోడ్డు మధ్యలో కూడా, వడ్లను ఆరబోయడంతో వాహనాలు వెళ్లడానికి, కనీసం దారి లేని పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ధాన్యం కుప్పలు, బైక్ పై వెళ్లే వారికి మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఇక్కడ రైతులను తప్పుబట్టడం కంటే, వారి ఇబ్బందులను గమనించి తగిన సౌకర్యాలు కల్పించడంలో, అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పొలాల్లో, గ్రామ శివార్లలో ధాన్యం ఆరబోసుకునేందుకు సరైన వేదికలు లేకపోవడం వల్లే, రైతులు ప్రాణాలకు తెగించి మరీ రోడ్లపైకి వస్తున్నారు.

ఒకవైపు అన్నదాతల ఆవేదన, మరోవైపు ప్రయాణికుల ప్రాణ భయం.. ఈ రెండింటి మధ్య నలుగుతున్న సామాన్యుడి గోడును వినేవారెవరు? రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల, పెను ప్రమాదం సంభవించకముందే యంత్రాంగం మేల్కోవాలి. కేవలం నిబంధనలు విధిస్తే సరిపోదు, రైతులకు ధాన్యం ఆరబోసుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను వెంటనే ఏర్పాటు చేయాలని, అదే సమయంలో రహదారుల వెంట ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటూ, అటు రైతుకు నష్టం కలగకుండా, ఇటు వాహనదారుల ఊపిరికి చిల్లు పడకుండా సమన్వయంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు