విశాఖపట్టణం, క్రైమ్ మిర్రర్: దేశంలోనే అత్యున్నతంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంకు ముహూర్తం ఖరారైంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తో పాటు గూగుల్ సంస్థకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికావెలుపల అత్యధిక పెట్టుబడి 15 బిలియన్ డాలర్ల (రూ.1.35 లక్షల కోట్లకు పైగా) వ్యయంతో చేపడుతున్న మొదటి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను నిర్మించనున్నారు.
2028 చివరికి డేటా సెంటర్ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గూగుల్ డేటా సెంటర్కు మూడు చోట్ల మొత్తం 601.4 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం తర్లువాడలో 266.6 ఎకరాలు, విశాఖ గ్రామీణ మండలం అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏపీఐఐసీకి చెందిన 174.8 ఎకరాలు కేటాయించారు.గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ గత ఏడాది అక్టోబర్ 14న ఎంవోయూపై సంతకాలు చేశాయి. అవసరమైన భూమిని ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది. మూడు డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
దీనికోసం 601.40 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.విశాఖపట్టణం తీర ప్రాంతం కావడంతో ఇక్కడి నుండి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ద్వారా నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల విశాఖ నగరం అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ ప్రధాన కేంద్రంగా మారనుంది.
