* ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో చెరగని ముద్ర
* రాజకీయ, సేవా రంగాల్లో సైతం విశిష్ట స్థానం
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్: నందమూరి బాలకృష్ణ.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. భారత చిత్ర పరిశ్రమలో ఒక లెజెండరీ కథానాయకుడు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించారు. తన తండ్రి నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కంటూ ఒక సొంత మేనరిజం అలవర్చుకున్నారు. ఐదు దశాబ్దాల సినిమా కెరీర్లో 105 కు పైగా సినిమాలు నటించారు. రాజకీయ రంగంలోకి వచ్చి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సామాజిక సేవలు అందిస్తున్నారు. గత ఏడాది ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును అందించింది. ఈ ఏడాది బాలకృష్ణ ఐదు దశాబ్దాల సిటీ ప్రస్థానానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించింది. బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా చేతుల మీదుగా ఆయన సన్మానం అందుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.
ఎన్టీఆర్ వారసుడిగా..
భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు నందమూరి తారక రామారావు. ఆయన కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నటనతో పాటు డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకులు నలుగురు కొనసాగుతుండగా.. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి సత్తా చాటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్ లో స్నానం సంపాదించారు బాలకృష్ణ. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం తన తండ్రి పేరు మీదగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును కూడా బాలయ్య అందుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును స్వీకరించారు. బాలయ్యకు ఈ అరుదైన గౌరవం దక్కడం పై నందమూరి అభిమానులు ఆనందమే వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి దర్శకత్వంలో తొలి సినిమా..
1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కల సినిమాలో తొలిసారిగా నటించారు బాలకృష్ణ. హీరోగా మాత్రం 1984లో సాహసమే జీవితం సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1987లో బాలకృష్ణ హీరోగా నటించిన ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తన తండ్రి పాత్రలో మెప్పించారు. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన 109 చిత్రాల్లో దాదాపు 72 సంక్రాంతి సమయంలోనే విడుదలయ్యాయి. బుల్లితెర హోస్టుగా సైతం మెప్పించారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ కార్యక్రమం బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వయస్సు 66 సంవత్సరాలు. ఈ వయసులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఆయన నటించిన భగవంతుడు కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘nbk 111’ సినిమాలో నటిస్తున్నారు. ఇటువంటి సమయంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం పై తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. పలువురు చిత్ర ప్రముఖులు ఆయనకు అభినందన తెలిపారు.
