ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా పేరు పొందిన ఐపీఎల్ ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కోట్ల రూపాయల పారితోషికాలు, అగ్రశ్రేణి ఆటగాళ్ల ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఈ లీగ్ ప్రత్యేకత. అయితే ఈ వేదికపై ఎన్నో అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు చేసినప్పటికీ, కొందరు స్టార్ ఆటగాళ్లు ఇప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం ఆసక్తికరమైన విషయంగా మారింది. పరుగుల వరద పారించినా, జట్టును విజయ శిఖరానికి చేర్చలేకపోయిన ఈ ఆటగాళ్ల కథలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వ్యక్తిగత ప్రతిభ ఎంత ఉన్నా, జట్టు విజయమే చివరకు నిర్ణయాత్మకమవుతుందని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ అతను చూపించిన ఆటతీరు క్రికెట్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. తన కెరీర్‌లో 5,162 పరుగులు సాధించి, అనేక సార్లు జట్టును ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు చేర్చడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, చివరికి టైటిల్ మాత్రం అతనికి దక్కలేదు. ఇదే విధంగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా ఐపీఎల్‌లో తన దూకుడైన ఆటతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేయడం మాత్రమే కాకుండా, 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, అతనికి కూడా ట్రోఫీ మాత్రం అందలేదు.
ప్రస్తుత తరం ఆటగాళ్లలో రిషబ్ పంత్ పరిస్థితి కూడా కొంతవరకు ఇలాగే ఉంది. 2026 సీజన్‌లో లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తూ రూ.27 కోట్ల భారీ పారితోషికంతో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా నిలిచాడు. 2020లో ఢిల్లీ జట్టు తరఫున ఫైనల్‌కి చేరుకున్నప్పటికీ, ముంబై జట్టు చేతిలో ఓటమి చవిచూశాడు. ఇప్పటివరకు 125 మ్యాచ్‌ల్లో 3,553 పరుగులు చేసిన పంత్, ఈసారి తన జట్టుకు టైటిల్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని ప్రదర్శనపై అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.
ఇక నిలకడకు ప్రతీకగా చెప్పబడే కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అత్యంత విశ్వసనీయ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఏడు సీజన్లలో 500కు పైగా పరుగులు నమోదు చేసి మొత్తం 5,222 పరుగులు సాధించినప్పటికీ, టైటిల్ మాత్రం అతని చేతికి అందలేదు. పంజాబ్, లక్నో జట్లకు నాయకత్వం వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు సంజూ శామ్సన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 4,704 పరుగులు చేసిన అతను రాజస్థాన్ జట్టు నుంచి రూ.18 కోట్లకు చెన్నై జట్టుకు మారడం విశేషం. ఈ ఇద్దరు ఆటగాళ్ల ఉమ్మడి పారితోషికం రూ.45 కోట్లు కావడం గమనార్హం.
ALSO READ: మీకు తెలుసా? ప్రధాని మోదీ బట్టలు ఇక్కడే కొంటారు!
