ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు అందించి దేశంతో పాటు తమిళనాడుకు పేరు తీసుకొచ్చిన క్రీడాకారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఘనంగా అభినందించారు. వారి ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజత పతకం సాధించిన భారత జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌కు చెరో రూ.50 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT) అమలు చేస్తున్న ‘ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్’ కింద ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలైన తమిళనాడు క్రీడాకారిణి జి. కమలినికి రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు.
విద్య, విశాల్‌పై సీఎం ప్రశంసలు
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజతం సాధించిన భారత జట్టుకు సీఎం విజయ్ అభినందనలు తెలిపారు. నలుగురు సభ్యులతో కూడిన భారత బృందంలో ఇద్దరు తమిళనాడుకు చెందిన క్రీడాకారులు ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. విద్య రామరాజ్, విశాల్ సాధించిన విజయం క్రీడల్లో రాణించాలని కోరుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి తమిళనాడుతో పాటు దేశానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
3:14.46 సెకన్లలో రేసు పూర్తి
విద్య రామరాజ్, విశాల్, మను, పూవమ్మలతో కూడిన భారత జట్టు 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేను 3:14.46 సెకన్లలో పూర్తి చేసి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్లలో రేసును పూర్తి చేసి గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
ఆసియా క్రీడల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు ఇది వరుసగా మూడో పతకం. 2018లో భారత్ స్వర్ణం సాధించగా.. 2022లో రజత పతకం దక్కింది. తాజాగా మరోసారి రజతంతో భారత జట్టు పతకాల జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
also read: మహేశ్ బాబు కొత్త లుక్.. ‘వారణాసి’ కోసమేనా?
