Saturday, March 28, 2026
Homeజాతీయంఏప్రిల్ 1 కొత్త రూల్స్.. గ్యాస్, ఏటీఎమ్ కార్డు ఉన్నవాళ్లు ఇవి తప్పక తెలుసుకోండి

ఏప్రిల్ 1 కొత్త రూల్స్.. గ్యాస్, ఏటీఎమ్ కార్డు ఉన్నవాళ్లు ఇవి తప్పక తెలుసుకోండి

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు బ్యాంకింగ్, ఆదాయపు పన్ను, గ్యాస్ ధరలు, రైల్వే సేవలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రతిరోజూ మనం చేసే ఆర్థిక లావాదేవీలపై ఇవి నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక ప్రణాళికలు ఈ కొత్త నిబంధనలతో మారే అవకాశం ఉంది. కొన్ని మార్పులు ఉపశమనం కలిగించగా, మరికొన్ని అదనపు భారాన్ని మోపే అవకాశముంది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడానికి కొత్త విధానం అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు కల్పించే అవకాశం ఉంది. సెక్షన్ 87A కింద ఈ సడలింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించేందుకు ఫారం 16, 16A స్థానంలో ఫారం 130, 131 ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా పన్ను రిటర్నులు దాఖలు చేయడం సులభతరం అవుతుంది. ఇకపై అసెస్మెంట్ ఇయర్ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో పన్ను సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించనున్నారు.

పాన్ కార్డు నిబంధనల్లో కూడా కఠినతరం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు ఆధార్ ఆధారంగా పాన్ కార్డు పొందే అవకాశం ఉండేది. కానీ ఏప్రిల్ 1 నుంచి పుట్టిన తేదీ ధృవీకరణ కోసం తప్పనిసరిగా 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాన్ కార్డు పొందే ప్రక్రియలో మరింత స్పష్టత, కట్టుదిట్టత రానుంది.

బ్యాంకింగ్ రంగంలో కూడా వినియోగదారులపై అదనపు భారాన్ని మోపే మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.23 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఒకవేళ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో లావాదేవీ విఫలమైతే రూ.25 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణ పరిమితిని 1 లక్ష నుంచి రూ.50,000 నుండి రూ.75,000 మధ్యకు తగ్గించే యోచనలో బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంధన రంగంలో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1న ఎల్‌పిజి, సిఎన్జీ ధరలను సవరించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది.

రైల్వే ప్రయాణికులకు కూడా కొత్త నిబంధనలు కఠినంగా మారనున్నాయి. టిక్కెట్ రద్దు నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టిక్కెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50శాతం మాత్రమే తిరిగి లభిస్తుంది. 72 గంటల కంటే ముందే రద్దు చేస్తే కొన్ని కోతలతో రీఫండ్ అందించనున్నారు. ఈ మార్పులు ప్రయాణ ప్రణాళికలో ముందస్తు జాగ్రత్త అవసరాన్ని పెంచనున్నాయి.

మొత్తంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు కొంతమందికి ఊరటనిస్తే, మరికొంతమందికి అదనపు ఖర్చులను తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మీ ఆర్థిక వ్యవహారాలను సరిచేసుకుని, కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అవసరం.

ALSO READ: కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments