Harassment Leads to Murder: ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు భార్యలు, పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ, మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి చివరకు దారుణంగా హత్యకు గురయ్యాడు. యూపీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
యూపీలోని సుమెర్‌పుర్ గ్రామానికి చెందిన గుల్సన్ అలియాస్ మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, అతడు అదే గ్రామానికి చెందిన సుమన్ దేవీ అనే మహిళకు దగ్గరయ్యాడు. ఆమె భర్త ఉద్యోగం కోసం వేరే రాష్ట్రంలో ఉండటంతో, ఊళ్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ సమయంలో మున్నా తరచూ సహాయం చేస్తూ ఆమెకు చేరువయ్యాడు. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.
లైంగిక వేధింపులు తట్టుకోలేక..
కొంతకాలం పాటు ఈ సంబంధం సజావుగా కొనసాగినా, తర్వాత పరిస్థితి మారింది. మున్నా తరచూ శృంగారం కోసం ఒత్తిడి చేయడం, వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు రోజురోజుకీ పెరగడంతో సుమన్ దేవీ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. చివరకు అతని నుంచి తప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పిన సుమన్ దేవీ, అతడితో కలిసి మున్నాను చంపాలని ప్లాన్ చేశారు. మార్చి 18న మున్నాను ఇంటికి పిలిచింది. ముందుగానే అక్కడ దాక్కున్న ఆమె సోదరుడు, అతడి ఇద్దరు స్నేహితులు మున్నా ఇంట్లోకి రాగానే అతడిపై దాడి చేశారు. ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేసి, శవాన్ని బస్తాలో పెట్టి సమీప కాలువలో పడేశారు.
పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి..
మున్నా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సుమన్ దేవీపై అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించగా నిజం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
