Homeక్రైమ్Cyber Scam: వాట్సాప్ కాల్స్‌ తో బెదిరింపు.. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ గ్యాంగ్!

Cyber Scam: వాట్సాప్ కాల్స్‌ తో బెదిరింపు.. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ గ్యాంగ్!

Cyber Scam in Karnataka: కర్ణాటకలోని బెళగావిలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్‌ మోసం  దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సీబీఐ అధికారులమని నమ్మించి ఓ వృద్ధుడిని లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు, అతని నుంచి ఏకంగా రూ.15.45 కోట్లను కొట్టేశారు. టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తూ నేరగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో ఈ ఘటనతో మరోసారి స్పష్టం అయ్యింది.

సీబీఐ అధికారులమంటూ వృద్ధుడికి వీడియో కాల్‌

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ముందుగా సీబీఐ అధికారులమని చెప్పుతూ ఆ వృద్ధుడికి వీడియో కాల్‌ చేశారు. అతడిని ఓ కేసులో బుక్ చేస్తున్నట్లు భయపెట్టి, విచారణ పేరుతో ఒత్తిడి చేశారు. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా నిరంతరం బెదిరింపులు కొనసాగించారు. చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటానన్న భయంతో ఆ వృద్ధుడు నేరగాళ్ల మాటలు నమ్మి, పలుమార్లు పెద్ద మొత్తాల్లో డబ్బులు ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు.

డబ్బు పంపిన తర్వాత మోసం జరినట్టు గుర్తింపు

ఈ మోసం అంత సులభంగా బయటపడకపోవడానికి కారణం, నిందితులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం. ప్రతి కాల్‌లో అధికారుల్లా మాట్లాడటం, అధికారిక టోన్‌ ను ఉపయోగించడం, వీడియో కాల్స్‌ లో నమ్మకంగా కనిపించడం ద్వారా బాధితుడిని పూర్తిగా భయభ్రాంతులకు గురిచేశారు. చివరికి డబ్బులు మొత్తం పంపించిన తర్వాతే తనకు మోసం జరిగినట్టు ఆ వృద్ధుడు గ్రహించాడు.

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

మోసపోయినట్లు తెలిసిన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌ డేటా, బ్యాంక్‌ లావాదేవీలను పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌, ముఖ్యంగా అధికారులమని చెప్పి డబ్బులు అడిగే వారిని అస్సలు నమ్మవద్దని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద కాల్‌ వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించారు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు