Homeఆంధ్ర ప్రదేశ్Bjp Leaders: తీవ్ర అసంతృప్తితో ఆ బిజెపి సీనియర్.. కూటమిపై ఫైర్!

Bjp Leaders: తీవ్ర అసంతృప్తితో ఆ బిజెపి సీనియర్.. కూటమిపై ఫైర్!

* ప్రభుత్వ పెద్దలపై సుజనా చౌదరి కినుక

* మంత్రి పదవి దక్కక పోయేసరికి అసహనం

క్రైమ్ మిర్రర్, ఏపీ: బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి అసంతృప్తితో ఉన్నారా? కూటమి ప్రభుత్వ చర్యలను ఆయన తప్పుపడుతున్నారా? తిరుమల వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్దల తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల సుజనా చౌదరి పొలిటికల్ గా యాక్టివ్ పెంచారు. అటు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి చెక్ చెబుతూ దూకుడుగా ముందడుగు వేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల ప్రభుత్వ పెద్దల తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కేవలం తనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోనే ఆయన అలా వ్యవహరిస్తున్నారన్న టాక్ అయితే మాత్రం ఉంది.

దక్కని మంత్రి పదవి..

మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు సుజనా చౌదరి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. బిజెపి ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. అయితే విస్తరణలో కూడా ఛాన్స్ వస్తుందా లేదా అనే అనుమానం ఉంది. కేవలం మంత్రి పదవి వస్తుందని భావించిన చౌదరి.. ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ మంత్రి పదవి దక్కకపోయేసరికి ఆయన అసంతృప్తికి గురైనట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విస్తరణలో ఛాన్స్ ఉంటుందని నమ్మిన ఆయనకు.. ఈసారి కూడా అటువంటి అవకాశం లేదని తెలుస్తుండడం తోనే అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

టిడిపిలోనే సుదీర్ఘకాలం

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు సుజనా చౌదరి. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు 2010లో తొలిసారిగా రాజ్యసభ పదవి వచ్చింది. 2014లో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారింది తెలుగుదేశం. ఆ సమయంలో టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సృజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి దక్కింది. 2014 నుంచి 2018 వరకు మోడీ మంత్రి వర్గంలో కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. 2016లో రెండోసారి టిడిపి తరఫున రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. కేంద్రమంత్రిగా ఉంటూనే రాజ్యసభలో టిడిపి పక్ష నేతగా వ్యవహరించారు. 2018లో తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనూహ్యంగా బిజెపిలోకి..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీలో చేరారు. సాటి టిడిపి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు లతో కలిసి బిజెపిలోకి వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో పార్టీని రక్షించేందుకుగాను.. బిజెపిని కూల్ చేసేందుకు గాను చంద్రబాబు సుజనా చౌదరిని బిజెపిలోకి పంపించారని ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే టిడిపిని బిజెపికి దగ్గర చేశారు. 2024లో పొత్తులో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చాన్స్ దక్కకపోయేసరికి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు