* ఏప్రిల్ ఒకటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం
* డెక్ భవనం కేంద్రంగా అడ్మినిస్ట్రేషన్
* ఏర్పాట్లు పూర్తి
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ కు గుడ్ న్యూస్. ఏప్రిల్ ఒకటి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలుకానున్నట్లు సమాచారం. గత ఆరేళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. కానీ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. దీంతో లోక్సభ వేదికగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తేజ్. కచ్చితంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని లోక్సభ వేదికగా ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా ఏప్రిల్ ఒకటి నుంచి విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కేవలం గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే కాదు.. అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి అన్ని రకాల కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
విభజన హామీగా..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి సికింద్రాబాద్ వేదికగా దక్షిణ మధ్య రైల్వే ఉండేది. అయితే రాష్ట్ర విభజనతో ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్ ఉండేది. విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కాకుండా.. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ అప్పట్లో అధికారంలోకి వచ్చింది. అయినా సరే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. అయితే అది ప్రకటన వరకే పరిమితం అయింది. కార్యరూపం మాత్రం ఎంతవరకు దాల్చలేదు.
ఏపీకి అత్యంత ప్రాధాన్యం..
2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే అది ఏపీలోనే టిడిపి నేతృత్వంలోని కూటమి బలంతోనే నిలబడగలిగింది మోడీ సర్కార్. అందుకే ఏపీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో విభజన హామీలు ఒక్కొక్కటి అమలుకు నోచుకున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసింది. కానీ అధికారిక కార్యకలాపాలు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కానీ ఏపీలో కూటమి సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. 2019లోనే ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దానిని అమలు చేయడంలో మాత్రం వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ ఏపీలో టిడిపి ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసింది. కేంద్రంపై ఒత్తిడి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా చేసింది.
శాశ్వత భవనాల నిర్మాణం..
కొద్ది నెలల కిందట ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే జోన్ శాశ్వత కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించారు. మూఢసార్లోవలో దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీనిపైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో డిఫెన్స్ లో పడింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది.
నగరం నడి బొడ్డున..
ఏప్రిల్ 1 నుంచి విశాఖ నగర నడిబొడ్డున ఉన్న డెక్ భవనం నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. దాదాపు 1700 మంది అధికారులతో పాటు సిబ్బంది సేవలు అందించనున్నారు ఈ రైల్వే జోన్ లో. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో చాలా డివిజన్లను విశాఖ జోన్ పరిధిలో చేర్చారు. కొత్తగా వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖ డివిజన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ డివిజన్ కూడా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విలీనం అయింది. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి మరో కొత్త రైల్వే జోన్ కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదే జరిగితే విభజిత ఏపీకి, నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక కొత్త శకం ప్రారంభం అయినట్టే.
