Homeఆంధ్ర ప్రదేశ్Nara Family: నారా కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ!

Nara Family: నారా కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ!

* ఆసక్తి చూపుతున్న నారా రోహిత్

* తండ్రి రామ్మూర్తి నాయుడు ఆశయ సాధనకు కృషి చేస్తానని ప్రకటన

* తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టీకరణ

క్రైమ్ మిర్రర్, తిరుపతి: నారా కుటుంబం నుంచి మరో యువ నేత పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? నారా రోహిత్ రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారా? తన తండ్రి రామ్మూర్తి నాయుడు మాదిరిగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా? పెదనాన్న చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సినీ రంగంలో తనకంటూ ముద్ర చాటుకున్నారు నారా రోహిత్. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. పెదనాన్న చంద్రబాబుతో పాటు సోదరుడు లోకేష్ తో సన్నిహితంగా ఉంటారు. మొన్న ఆ మధ్యన ఆయన వివాహం జరిగింది. పెద్దమ్మ నారా భువనేశ్వరి వివాహానికి పెద్దదిక్కుగా నిలిచారు. వేడుకగా వివాహం జరిపించారు. అయితే సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు రోహిత్ కు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది

తండ్రికి ఘన నివాళులు..

నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు. స్వయానా చంద్రబాబు సోదరుడు. గత ఏడాది ఆయన చనిపోయారు. చంద్రగిరికి ఆయన ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. ఆయన 74 వ జయంతి వేడుకలు స్వగ్రామం నారావారిపల్లెలో జరిగాయి. నారా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నారా రోహిత్ తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహపరిచారు.

నారా కుటుంబానికి ప్రత్యేక స్థానం..

తన పొలిటికల్ ఎంట్రీ పై హాట్ కామెంట్స్ చేశారు నారా రోహిత్. తన తండ్రి జ్ఞాపకార్థం చేస్తున్న పనులే తనను ప్రజలకు దగ్గర చేస్తాయని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తానని కూడా తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నారా కుటుంబానికి రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ చరిత్ర అందరికీ తెలిసిందే. 1978లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. మధ్యలో 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 1989 నుంచి 2024 ఎన్నికల వరకు గెలుస్తూనే ఉన్నారు. అయితే మధ్యలో 1994లో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ను చంద్రగిరి నుంచి టిక్కెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు నారా రోహిత్ వస్తానంటే పెదనాన్న చంద్రబాబు అభ్యంతరం తెలిపే అవకాశం లేదు. ఎందుకంటే సోదరుడు లోకేష్ విషయంలో ఎంతో సన్నిహితంగా, గౌరవంగా ఉంటారు రోహిత్.

చంద్రగిరి నుంచి పోటీ..

ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపికి ఎమ్మెల్యేగా పులివర్తి నాని ఉన్నారు. ఆయనపై ఎన్నో వివాదాలు తో పాటు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇక్కడ పట్టు ఎక్కువ. ఈ తరుణంలో నారా రోహిత్ టిడిపిలోకి వస్తే చంద్రగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు