సైబరాబాద్ క్రైమ్ మిర్రర్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మొత్తం 281 మంది పట్టుబడి కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ డ్రైవ్లో 224 ద్విచక్ర వాహనదారులు, 08 ఆటోలు, 42 కార్లు, 07 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే 246 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 19 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 16 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిని చట్టపరంగా కోర్టుకు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని, ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. గత వారం (23.02.2026 – 28.02.2026)లో మొత్తం 218 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో 13 మందికి జరిమానా, జైలు శిక్ష, 05 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 200 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
