Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీలో సర్వేల కలకలం!

వైసీపీలో సర్వేల కలకలం!

•వచ్చే ఎన్నికల్లో బలమైన నేతలను బరిలో దించేందుకు వ్యూహం
•ఆందోళనలో నియోజకవర్గ ఇన్చార్జిలు
•ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సర్వేలు కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ సర్వేలు చేస్తోంది. ఇప్పుడు కొనసాగుతున్న ఇన్చార్జిల స్థానంలో చాలా వరకు కొత్తవారు వస్తారన్న టాక్ ప్రారంభం అయింది. అలా అయితే పార్టీ కోసం ఎందుకు కష్టపడాలనుకుంటున్నారు కొందరు ఇన్చార్జిలు. గత ఎన్నికల్లో మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన వెంటనే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనను బుజ్జగించి మళ్లీ వైసీపీలోకి తెచ్చారు. 2029 ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీ తోనే రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు కూడా టికెట్ లేదని తేల్చి చెబుతున్నట్లు సమాచారం. అదే జరిగితే రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం దిశగా ఆల రామకృష్ణారెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో మార్పులు..
గత ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఈసారి కూడా అటువంటి మార్పులు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్థికంగా బలమైన నేతలను రంగంలోకి దించాలని చూస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్న నేతలు ఇప్పుడు ఆందోళనతో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో నేతల పనితీరుపై ఒక సర్వే నడుస్తోంది. మీ నియోజకవర్గంలో టిక్కెట్ ఎవరికీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. అలానే ఇప్పుడు ఉన్న ఇన్చార్జిలు మాత్రమే కాదు.. ఎన్నికల ముంగిట పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు ఉంటాయని హై కమాండ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆర్థికంగా బలమైన నేతలు కోసం నాయకత్వం ఆరాటపడుతోంది. దీంతో ఉన్న నేతలు సైతం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతున్నారు.

వ్యతిరేకతతో మార్పు..
మొన్నటి ఎన్నికల్లో చాలామందిని నేతలను నియోజకవర్గాల్లోను మార్చారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని చెప్పి పక్క నియోజకవర్గానికి మార్చారు. అటువంటి వారు ఇప్పుడు ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. మొన్న ఎన్నికల్లో సైతం చాలా మంది అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేశారు. ఆ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇటువంటి సమయంలో తప్పకుండా నియోజకవర్గ ఇన్చార్జి పై ఆర్థిక భారం పడుతుంది. అయితే త్వరలో మార్పులు ఉంటాయని ఈ సర్వేల ద్వారా తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల భారం తమది కాదు అంటూ చాలామంది ఇన్చార్జులు ముందే తేల్చి చెబుతున్నారు. తమకు 2029 ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటేనే దృష్టి పెడతామని తేల్చి చెబుతున్నారు. మొత్తానికైతే వైసీపీలో ఈ సర్వేల కలకలం పతాక స్థాయిలో ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు