క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కానీ వేసవిలో లేదా ఎక్కువసేపు ఎండలో ఫోన్ ఉపయోగిస్తే వేడెక్కడం చాలా మందికి ఎదురయ్యే కామన్ సమస్య. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఫోన్ తరచూ ఓవర్‌హీట్ అవుతూ ఉంటే బ్యాటరీ పనితీరు తగ్గడం నుంచి డివైస్ దెబ్బతినే వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాల్లో నేరుగా సూర్యరశ్మి పడటం, ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, మొబైల్ డేటా లేదా GPS నిరంతరం ఆన్‌లో ఉంచడం ముఖ్యమైనవి. ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఫోన్ వాడితే లోపలి ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి వేడి మరింత ఎక్కువ అవుతుంది.
ఓవర్‌హీట్ వల్ల ముందుగా ప్రభావం పడేది బ్యాటరీపైనే. బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. కొన్నిసార్లు ఉబ్బిపోవడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఫోన్ పనితీరు కూడా మందగిస్తుంది. యాప్స్ నెమ్మదిగా ఓపెన్ అవడం, హ్యాంగ్ అవడం, స్క్రీన్ స్పందించకపోవడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. వేడి పెరిగినప్పుడు ప్రాసెసర్ తన స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా తగ్గించుకుంటుంది. అందుకే ఫోన్ స్లోగా అనిపిస్తుంది.అలాగే కెమెరాపైనా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు కెమెరా యాప్ క్లోజ్ అవ్వడం లేదా వీడియో రికార్డింగ్ మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే డిస్‌ప్లే, సెన్సార్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎండలో ఫోన్‌ను నేరుగా ఉంచకండి. ముఖ్యంగా బైక్ డాష్‌బోర్డ్‌పై లేదా కారులో సూర్యరశ్మి పడే చోట పెట్టడం మంచిది కాదు. వీలైనంత వరకు చల్లని ప్రదేశంలో ఉంచండి.ఫోన్ బాగా వేడిగా ఉన్నప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టకండి. కాసేపు చల్లబడిన తర్వాతే ఛార్జ్ చేయండి. అలాగే ఒరిజినల్ ఛార్జర్ వాడటం మంచిది.
వాడని యాప్స్‌ను క్లోజ్ చేయండి. బ్లూటూత్, GPS, హాట్‌స్పాట్ అవసరం లేకపోతే ఆఫ్ చేయండి. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గిస్తే కూడా వేడి తగ్గుతుంది. వేసవిలో గేమింగ్ లేదా హెవీ వీడియో ఎడిటింగ్ ఎక్కువసేపు చేయకుండా మధ్యలో విరామం ఇవ్వండి.
ఫోన్‌కు మందమైన కవర్ ఉంటే వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకడుతుంది. కాబట్టి ఫోన్ ఎక్కువగా వేడెక్కుతున్నప్పుడు కవర్ తీసేయడం కూడా ఉపయోగపడుతుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు… ఎండలోనూ మీ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది… పనితీరు కూడా బాగానే ఉంటుంది.