-
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
-
నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు
నాంపల్లి(క్రైమ్ మిర్రర్): రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు స్థానిక ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వాహనదారులు తమ వెంట ఎప్పుడూ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు, వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే సకాలంలో ఇన్సూరెన్స్‌లను పునరుద్ధరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేసే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం వంటివి అత్యంత ప్రమాదకరమని, ఇవే ప్రధానంగా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు..

వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ, తమ కోసం ఇంట్లో వేచి చూసే కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. సమాజ రక్షణలో భాగంగా తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డితో పాటు, పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
