క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు మే 6 లోపు తమ కౌంటర్ అఫిడవిట్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు కోర్టు మూడు వారాల సమయం ఇచ్చింది. మే 6 నాటికి కౌంటర్లు రికార్డుల్లో ఉండాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.
నోటీసులు పొందిన ఎమ్మెల్యేలు: దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం. సంజయ్ కుమార్ మరియు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులు అందాయి.
పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై తుది నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
