-
రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం..
-
150 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్.
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా గుట్టును, సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రట్టు చేశారు. అధిక లాభాలు, నెలవారీ ఆదాయం అంటూ ఆశ చూపి, అమాయక ప్రజల నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ‘శుభక్షేత్ర వెంచర్’ నిర్వాహకుడు, రమావత్ మధును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మియాపూర్‌లో కార్యాలయం ఏర్పాటు చేసిన నిందితుడు, ఐదు లక్షలు పెట్టుబడి పెడితే, సంగారెడ్డి జిల్లా దామరగిద్దలో 102 గజాల ప్లాట్ ఇవ్వడమే కాకుండా, 42 నెలల పాటు నెలకు 25 వేల చొప్పున ఆదాయం చెల్లిస్తామని నమ్మబలికాడు.
ఈ ఆకర్షణీయమైన స్కీమ్ చూసి నమ్మి పెట్టుబడి పెట్టిన దాదాపు, 31 మంది బాధితుల నుండి సుమారు 6.58 కోట్లు వసూలు చేసి, ఆ తర్వాత ప్లాట్లు రిజిస్టర్ చేయకుండా మొహం చాటేశాడు. బాధితులు తమ డబ్బు తిరిగి అడగగా వారిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం అందింది. గతంలో ‘గోకులానంద ఇన్ఫ్రా’ పేరుతో దాదాపు 150 కోట్ల మోసానికి పాల్పడి, సీఐడి విచారణ ఎదుర్కొంటున్న మధు, మళ్ళీ కొత్త పేరుతో ఈ దందాకు తెరలేపాడు.
ప్రముఖ గాయని మంగ్లీ పేరుతో ఉన్న పాత వివాదాల్లో కూడా, ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ స్కామ్‌లో మరెవరి ప్రమేయం ఉందనే, కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఇలాంటి మోసపూరిత స్కీమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
