అక్కినేని నాగార్జున ఇంట్లో ఒకేసారి రెండు శుభకార్యాలు జరగనున్నాయి. అక్కినేని నాగచైతన్య- శోభిత వివాహానికి అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక ఉండగానే అఖిల్ నిశ్చితార్థం జరిగిందని ప్రకటించి అందరికి షాకిచ్చారు హీరో నాగార్జున.అఖిల్ – జైనాబ్ రౌజీ ఎంగేజ్ మెంట్ అయిందని తెలిపారు. అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో ఈ ప్రేమ జంట వైవాహిక బంధం వైపు అడుగులేసింది.
జైనాబ్ రౌజీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్. నాగార్జునకు, జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ ఫ్రెండ్ కావడంతో ఈ ప్రేమ జంటకు మార్గం సుగమమైంది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కావడంతో దుబాయ్, లండన్, ఇండియాతో పాటు పలు దేశాల్లో జైనాబ్ జీవితాన్ని గడిపింది. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో సొంత ఇల్లు కూడా ఉంది. జైనాబ్ రవ్జీ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిట్ట. జైనాబ్ రవ్జీ కూడా థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా చిత్రలేఖనంలో రాణిస్తుందని తెలుస్తోంది. క్రియేటివిటీ, కల్చర్ ప్రతిబింబించేలా ఆమె పెయింటింగ్స్ ఉంటాయని చెబుతున్నారు.
అఖిల్, జైనాబ్ రవ్జీ నిశ్చితార్థం 2024 నవంబర్‌లో జరిగినప్పటికీ పెళ్లి మాత్రం 2025లో జరగనుంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అఖిల్‌కు గతంలో ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి రద్దైంది. ఆ తర్వాత శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అఖిల్ పెళ్లి పీటలెక్కనుండటంతో అక్కినేని కుటుంబంలో కోలాహలం కనిపించింది.