-
బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: లైంగిక వేధింపుల కేసు పై రెజ్లర్ వినేష్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ బూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్రిజ్ భూషణ్‌పై దాఖలైన కేసు విచారణ న్యాయస్థానంలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రస్తుతం సాక్ష్యాల నమోదు జరుగుతున్నందున తన ఉనికిని వెల్లడించకూడదని, న్యాయపోరాటం కొనసాగించాలని గతంలో తాను నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏ బాధితురాలి గుర్తింపును వెల్లడించరాదని, అలా చేస్తే వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందని ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో వినేష్ తెలిపారు. కాని కొన్ని పరిస్థితుల కారణంగా తాను అన్ని విషయాలు పంచుకోదలచుకున్నానని ఆమె చెప్పారు.
కేసు కోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నందున తాను దానిపై మాట్లాడదలచుకోలేదని, అయితే ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో తాను కూడా ఒకరినని చెప్పదలచుకున్నానని, ప్రస్తుతం సాక్ష్యాల నమోదు జరుగుతున్నదని వినేష్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 2023లో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో వినేష్ ఒకరు. బ్రిజ్ భూషణ్‌కు పలుకుబడి ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని గొండలో ర్యాంకింగ్ టోర్నమెంట్లు, ట్రయల్స్ నిర్వహించాలన్న డబ్ల్యూఎఫ్‌ఐ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. బ్రిజ్ భూషణ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, ట్రయల్స్ నిష్పాక్షికతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆమె అన్నారు.