క్రైమ్ మిర్రర్ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన భర్తకు రావాల్సిన వాటా భూమిని ఇతరుల పేరుపై పట్టా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఉకొండి గ్రామానికి చెందిన జాల అంజమ్మకు ఇద్దరు కుమారులు జాల మల్లేష్, జాల మహేష్, ఒక కుమార్తె కన్నబోయిన పద్మ ఉన్నారు. గతంలో అంజమ్మ తన పెద్ద కుమారుడు మల్లేష్‌కు రెండున్నర ఎకరాలు, చిన్న కుమారుడు మహేష్‌కు నాలుగున్నర ఎకరాల భూమిని పట్టా చేసినట్లు సమాచారం. మిగిలిన ఐదు ఎకరాల భూమి అంజమ్మ పేరుపై ఉంది.
అయితే, ఆ భూమిలో మూడు ఎకరాలను తన కుమార్తె కన్నబోయిన పద్మ పేరుపై పట్టా చేసేందుకు స్లాట్ బుక్ చేసిన విషయం తెలుసుకున్న మల్లేష్, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని తహశీల్దార్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో చర్చించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదని, గురువారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారని సమాచారం అందడంతో మల్లేష్ భార్య భాగ్యలక్ష్మి అక్కడికి చేరుకుంది. భూమి పట్టా ప్రక్రియను నిలిపివేయాలని తహశీల్దార్‌ను కోరింది.
అయితే ఈ విషయంలో తమ పరిధిలో చర్యలు తీసుకోలేమని అధికారులు చెప్పడంతో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడున్న కార్యాలయ సిబ్బంది, స్థానికులు స్పందించి ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తన అత్త, మరిది, ఆడబిడ్డ కలిసి తనకు రావాల్సిన ఆస్తిని దక్కకుండా చేస్తున్నారని భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు వివరాలు
సేకరిస్తున్నారు.
also read : కట్నం వేధింపులు భరించలేక ఉపాధ్యాయురాలి ఆత్మహత్య… సెల్ఫీ వీడియో వైరల్…
