మధుమేహంతో బాధపడుతున్న చాలా మందికి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. కొందరు రోజుకు ఒకసారి, మరికొందరు రెండు, అంతకంటే ఎక్కువసార్లు కూడా ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారికి ఓ శుభవార్త. ఇక ప్రతిరోజూ కాదు.. వారానికి ఒక్కసారి మాత్రమే ఇన్సులిన్ తీసుకునే కొత్త చికిత్స భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.ప్రపంచ ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసిన ఈ కొత్త ఇంజెక్షన్ పేరు అవిక్లీ. దీనిని ఇన్సులిన్ అయోడెక్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇదే కావడం విశేషం.
సాధారణంగా మనం ఆహారం తీసుకోకపోయినా కాలేయం కొంత గ్లూకోజ్‌ను శరీరంలోకి విడుదల చేస్తుంది. అలాంటి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు అవసరమైన ఇన్సులిన్‌ను బేసల్ ఇన్సులిన్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్లు 24 నుంచి 42 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. అందుకే వాటిని దాదాపు ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవిక్లీ ఒక్కసారి తీసుకుంటే ఏకంగా వారం రోజుల పాటు ప్రభావం చూపుతుంది. వైద్యుల సూచన మేరకు టైప్-1, టైప్-2 మధుమేహ బాధితులు ఈ ఇంజెక్షన్‌ను ఉపయోగించవచ్చు. రోజూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన ఇబ్బంది తగ్గడంతో పాటు చికిత్సను సులభంగా కొనసాగించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
భారత్‌లో చాలా మంది మధుమేహ రోగులు ఇన్సులిన్ ఖర్చు, ఇంజెక్షన్ నొప్పి వంటి కారణాలతో అవసరమైన చికిత్సను 7 నుంచి 9 సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ సమస్యలను కొంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు నోవో నార్డిస్క్ తెలిపింది. ధర విషయానికి వస్తే, 700 యూనిట్ల అవిక్లీ పెన్ ధర రూ.2,611. అంటే ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.3.73 మాత్రమే ఖర్చవుతుంది. ఇది రోజువారీ ఇన్సులిన్‌తో పోలిస్తే యూనిట్‌కు 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ఖర్చవుతుంది.