కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ సైబర్ మోసం సంఘటన ప్రస్తుతం అందరినీ అప్రమత్తం చేస్తోంది. సాధారణంగా కనిపించిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కారణంగా డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ దాదాపు రూ.10 లక్షలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో వాట్సాప్‌లో వచ్చే అపరిచిత ఫైల్స్ ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది.
బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్న ఆ అధికారి తన వాట్సాప్‌కు వచ్చిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను గమనించారు. అది APK ఫార్మాట్‌లో ఉండటంతో, ఎలాంటి అనుమానం లేకుండా డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేశారు. అయితే కొద్దిసేపట్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి వరుసగా డబ్బులు డెబిట్ కావడం ప్రారంభమైంది. వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయగా మొత్తం రూ.9,96,659 నగదు అకౌంట్ నుంచి మాయమైనట్లు తెలిసింది.
సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన ఆయన వెంటనే తన మొబైల్‌లో ఉన్న యాప్స్ తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన సైబర్ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్స్ చాలా ప్రమాదకరమని, అవి మాల్వేర్‌ను ఫోన్‌లోకి పంపించే అవకాశముందని తెలిపారు.
ఒకసారి అలాంటి ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మోసగాళ్లు ఫోన్‌పై పూర్తిగా నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, OTPలు, మెసేజ్‌లు వంటి సున్నితమైన డేటాను దొంగిలించి క్షణాల్లో డబ్బును ఖాతాల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో “వెడ్డింగ్ కార్డ్” లేదా “ఈవెంట్ ఇన్విటేషన్” పేరుతో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారిక యాప్స్‌ను కేవలం విశ్వసనీయ వేదికల నుంచే ఇన్‌స్టాల్ చేయాలని, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే బ్యాంక్ లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.