రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్: పండుగ సెలవుల నేపథ్యంలో హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరిన 6వ తరగతి విద్యార్థి దారి తప్పాడు. గద్దేరాగడి అమ్మగార్డెన్ చౌరస్తా వద్ద ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి ‘డయల్ 112’కు సమాచారం అందించారు. పోలీసులు సకాలంలో స్పందించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా చేర్చారు.వివరాల్లోకి వెళితే…మందమర్రి దొరలబంగ్లాకు ఏరియాకు చెందిన ఎం.అస్విత్ మంచిర్యాల సమీపంలోని సున్నంబట్టివాడ (సాయికుంట)లోని బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటూ సమీపంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కృష్ణాష్టమి వరుస సెలవుల సందర్భంగా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులను ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించారు. దీంతో అస్విత్ మంచిర్యాలలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ తాళం వేసి ఉండటంతో తిరిగి మందమర్రికి వెళ్లేందుకు బయలుదేరాడు.మార్గమధ్యలో ఓ వాహనదారుడిని లిఫ్ట్ కోరగా గద్దె రాగడి వద్ద దింపి వెళ్లిపోయాడు.
Also Read: వాయుసేనకు వీడ్కోలు.. కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్
అక్కడి నుంచి దారి తెలియక అమ్మగార్డెన్ చౌరస్తా వద్ద ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే ‘డయల్ 112’కు సమాచారం అందించడంతో బ్లూకోట్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఎస్సై జె.శ్రీధర్ బాలుడి వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బాలుడిని క్షేమంగా అప్పగించారు.సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు, ‘డయల్ 112’ సిబ్బంది, బ్లూకోట్స్ పోలీసులను పలువురు అభినందించారు. చిన్నారులు ఒంటరిగా, అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై జె. శ్రీధర్ సూచించారు.
Also Read:రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
