క్రైమ్ మిర్రర్ : అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జమ్మూలోని కనాచక్ సెక్టార్లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు ప్రాంతంలోని సోహన్ బోర్డర్ అవుట్‌పోస్ట్ (బీవోపీ) సమీపంలో 44వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు సాధారణ గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా భారత భూభాగంలోకి వచ్చిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతడిని పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లాకు చెందిన లూని గ్రామ నివాసి నజీర్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు దాటడానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది అతడిని విచారిస్తున్నారు. నజీర్ అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చాడా? లేక ఉద్దేశపూర్వకంగానే భారత భూభాగంలోకి ప్రవేశించాడా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. అతడి చొరబాటు వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
ఘటనపై సమాచారం అందుకున్న కనాచక్ సెక్టార్ డీఐజీ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సరిహద్దు ప్రాంత భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చొరబాటుదారుడి నుంచి లభించిన వివరాలు, అతడి ఉద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ భరోసా.. అండగా నిలుస్తానని హామీ
