Homeజాతీయంవాయుసేనకు వీడ్కోలు.. కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్

వాయుసేనకు వీడ్కోలు.. కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్

క్రైమ్ మిర్రర్ : 2019లో భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో తన ధైర్యసాహసాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వాయుసేన మాజీ పైలట్‌ గ్రూప్‌ కెప్టెన్‌ అభినందన్‌ వర్ధమాన్‌ కొత్త ప్రస్థానం ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళానికి ముందస్తు పదవీ విరమణ చేసిన ఆయన.. ప్రస్తుతం కమర్షియల్‌ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గోవాకు చెందిన ఎఫ్‌ఎల్‌వై91 విమానయాన సంస్థలో ఆయన గత ఆగస్టులోనే చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాణిజ్య విమానాలను నడుపుతున్నట్లు సమాచారం. అయితే అభినందన్‌ తమ సంస్థలో పనిచేస్తున్నారా అనే అంశంపై ఎఫ్‌ఎల్‌వై91 ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

బాలాకోట్‌ ఘటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు

2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్‌ బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అనంతరం పాకిస్థాన్‌ కూడా భారత గగనతలంపైకి యుద్ధ విమానాలను పంపింది.

ఆ సమయంలో మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానంతో విధుల్లో ఉన్న అభినందన్‌ వర్ధమాన్‌.. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని ఎదుర్కొని దాన్ని కూల్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఆయన ప్రయాణిస్తున్న మిగ్‌-21పై దాడి జరగడంతో అభినందన్‌ పారాచూట్‌ ద్వారా విమానం నుంచి బయటకు వచ్చారు.

అనుకోని పరిస్థితుల్లో ఆయన పాకిస్థాన్‌ భూభాగంలో దిగడంతో అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది. సుమారు 60 గంటల పాటు పాక్‌ ఆధీనంలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయాలంటూ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. చివరకు పాకిస్థాన్‌ ఆయనను భారత్‌కు అప్పగించింది.అభినందన్‌ చూపిన ధైర్యసాహసాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు వీర్‌ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పుడు వాయుసేన సేవలకు వీడ్కోలు పలికి కమర్షియల్‌ ఏవియేషన్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు సమాచారం.
also read : రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు