Homeఆంధ్ర ప్రదేశ్వందే భారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ ఊరట!

వందే భారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ ఊరట!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పబోతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మీదుగా పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా, ఇప్పుడు సుదూర ప్రయాణికుల కోసం ‘వందే భారత్ స్లీపర్’ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ – న్యూఢిల్లీ మార్గంలో ఈ అత్యాధునిక స్లీపర్ రైలును ప్రవేశపెట్టే దిశగా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉండటంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కొంత అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా స్లీపర్ కోచ్‌లతో కూడిన కొత్త వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ రైళ్లలో ప్రయాణికులు కుదుపులు, శబ్దాలు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

 

రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ రైళ్లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. నిద్రిస్తూ గమ్యస్థానానికి చేరుకునేలా ప్రత్యేక సదుపాయాలతో కోచ్‌లను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన కొన్ని వందే భారత్ స్లీపర్ సేవలకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ – న్యూఢిల్లీ రూట్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే పలు మార్గాల్లో కూడా ఈ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ – శ్రీనగర్, న్యూఢిల్లీ – చెన్నై, ముంబై – అహ్మదాబాద్, ముంబై – బెంగళూరు, న్యూఢిల్లీ – పుణె, న్యూఢిల్లీ – హౌరా వంటి కీలక మార్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త రైలు సెట్ల తయారీ పూర్తైన తర్వాత దశలవారీగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వంటి సుదూర నగరాలకు ప్రయాణించే వారికి సమయం ఆదా కావడంతో పాటు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభించే అవకాశం ఉంది. దీంతో రైల్వే ప్రయాణాలపై ఆసక్తి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు