Homeఅంతర్జాతీయంUS Strikes: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. మళ్లీ ఉద్రిక్తంగా మిడిల్ ఈస్ట్!

US Strikes: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. మళ్లీ ఉద్రిక్తంగా మిడిల్ ఈస్ట్!

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది.  హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణుల నిల్వ కేంద్రాలు, డ్రోన్ మౌలిక సదుపాయాలు, తీరప్రాంత రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో జరిగిన డ్రోన్ దాడి కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని అమెరికా ఆరోపించింది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గంలో భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం బాధ్యతారాహిత్య చర్య అని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలకు అమెరికా తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ లక్ష్యాలపై దాడులు జరిపాయి.

ఇటీవలే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్నాయని భావించిన సమయంలో ఈ తాజా ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రతీకార దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు