‘బాహుబలి’ సినిమాలు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్స్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని రూ.2,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క శెట్టి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
బాహుబలి ప్రాజెక్ట్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక పడిన కష్టాలు, ఆసక్తికర సంఘటనలు, నటీనటుల అనుభవాలను చూపించారు. డాక్యుమెంటరీలో ప్రభాస్, అనుష్కతో పాటు రానా, తమన్నా, నిర్మాత శోభు యార్లగడ్డ తమ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ప్రభాస్, అనుష్క కలిసి కనిపించడమే. చాలా కాలం తర్వాత ఈ జంట ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. అయితే తాము కేవలం మంచి స్నేహితులమే అని ప్రభాస్, అనుష్క ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. డాక్యుమెంటరీలో అనుష్క ఆకుపచ్చ రంగు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించగా, ప్రభాస్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ గా మెరిశాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధం అభిమానులను మరోసారి ఆకట్టుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్-అనుష్క ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన జంటను మళ్లీ కలిసి చూసిన ఆనందాన్ని ఫ్యాన్స్ పోస్టులు, కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీతో మరోసారి బాహుబలి జ్ఞాపకాలు అభిమానుల్లో సజీవంగా మారాయి.