HomeజాతీయంKerala Govt: కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం.. మే 18న సతీశన్ ప్రమాణస్వీకారం!

Kerala Govt: కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం.. మే 18న సతీశన్ ప్రమాణస్వీకారం!

కేరళలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వీడీ సతీశన్ మంత్రివర్గ ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తామని, మే 18న తాను సహా కొత్త మంత్రులందరూ ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.

అందరినీ కలుపుకుని ముందుకు

ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (IUML) నేతలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన సతీశన్, తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు విద్వేష రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, యూడీఎఫ్ మాత్రం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే విధానాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ముస్లిం లీగ్ నాయకత్వం కూడా ఎప్పటినుంచో సెక్యులర్ విలువలను పాటిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో యూడీఎఫ్-ఐయూఎంఎల్ పొత్తుపై బీజేపీ, సీపీఎం తీవ్ర విమర్శలు చేశాయని సతీశన్ గుర్తుచేశారు. అయితే ప్రజలు ఆ ఆరోపణలను నమ్మలేదని, అందుకే తమ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారని అన్నారు. కేరళ ప్రజలు అభివృద్ధి, సామరస్య రాజకీయాలకే మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

102 సీట్లు గెలిచిన యూడీఎఫ్

ఈ ఎన్నికల్లో 140 స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల నివాసానికి వెళ్లి సతీశన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పు, శాఖల పంపిణీ వంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటూ సమతూకంగా కేబినెట్‌ను రూపొందించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2021 నుంచి ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీశన్, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై బలమైన పోరాటం చేసిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు ఆయన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టబోతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు