Homeక్రైమ్NEET Paper Leak: నీట్‌ లీక్‌ కేసులో బయాలజీ ప్రొఫెసర్ అరెస్ట్.. సీబీఐ దర్యాప్తులో షాకింగ్‌...

NEET Paper Leak: నీట్‌ లీక్‌ కేసులో బయాలజీ ప్రొఫెసర్ అరెస్ట్.. సీబీఐ దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు వెల్లడి!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రం బయటకు రావడానికి దానిని తయారు చేసిన కమిటీలో ఉన్న సభ్యులే కారణమయ్యారని సీబీఐ దర్యాప్తులో తేలుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రసాయనశాస్త్ర నిపుణుడు పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా జీవశాస్త్ర నిపుణురాలు మనీషా మంధారేను కూడా ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

నీట్‌ ప్రశ్నపత్రం తయారీ కమిటీ నుంచే లీక్

సీబీఐ విచారణలో బయటపడుతున్న వివరాలు మరింత షాకింగ్‌ గా మారాయి. నీట్‌ ప్రశ్నపత్రం తయారీ కమిటీలో పనిచేసే నిపుణులకు తమ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు సభ్యులు ప్రశ్నలను బయటకు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పీవీ కులకర్ణికి కెమిస్ట్రీ ప్రశ్నలు తెలిసి ఉండగా, మనీషా మంధారే వద్ద బయాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించారు.

భారీగా డబ్బులు వసూలు

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కులకర్ణి, పుణెలోని మరో మహిళ సహకారంతో విద్యార్థులను ఎంపిక చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సీబీఐ చెబుతోంది. అలాగే మనీషా మంధారే కూడా పుణెకు చెందిన మనీషా వాఘ్మరే సహాయంతో అభ్యర్థులను సమీకరించినట్లు సమాచారం. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్‌ ఇచ్చి, లీకైన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ప్రాక్టీస్‌ చేయించారని అధికారులు వెల్లడించారు. పుణెలోని ఇంట్లో రహస్యంగా క్లాసులు నిర్వహించారని, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల నోట్‌బుక్స్‌ లో ఉన్న ప్రశ్నలు అసలు నీట్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ తెలిపింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ప్లాన్‌ చేసి నిర్వహించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్

ఇక ఈ వివాదం నేపథ్యంలో నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలే తమకు తాముగా మెడికల్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు