న్యూ డిల్లి, క్రైమ్ మిర్రర్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్య మార్గంలో త్వరితగతిన పరిష్కారం లభించకుంటే అమెరికా కఠిన వైఖరిని తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందాలు కుదుర్చుకోకుంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఇక విధ్వంసమే అని హెచ్చరించారు. ఈమేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.
ట్రంప్ అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకున్న సీన్‌తో పాటు ‘నో మోర్ మిస్టర్ నైస్ గై’ (ఇకపై మంచివాడిలా ఉండను) నినాదం కలిగిన ఫొటోను తన పోస్ట్‌కు జతపరిచారు. ఇరాన్-అమెరికా చర్చల ప్రక్రియలో వేగం లోపించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కలిసికట్టుగా నిర్ణయాలను తీసుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు. అమెరికాతో ఒప్పందాన్ని ఖరారు చేసే సమర్ధత ఇరాన్ పాలకుల్లో లేదని విమర్శించారు. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో కూడా ఇరాన్ పాలకులకు తెలియదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్‌ను పాలిస్తున్న వాళ్లు త్వరగా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు