-
సోనియా గాంధీతో మమతా బెనర్జీ కీలక చర్చలు
-
బిజెపి రాజకీయ ఎదురు దాడికి విరుగుడుగా దీదీ నిర్ణయం
-
త్వరలో అధికారిక ప్రకటన
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ శాసనసభాపక్షం అడ్డగోలుగా చీలింది. మెజారిటీ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. లోక్సభ సభ్యులు ప్రత్యేక శిబిరం గా ఏర్పడి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రాజ్యసభ సభ్యులు సైతం వరుసగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బతో మమతా బెనర్జీ కుదేలయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనపై మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీఎంసీ ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం మమతా బెనర్జీకి కీలక పదవులు ఆఫర్ చేసినట్లు సమాచారం.
-
కాంగ్రెస్ సాయం కోరిన వైనం..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపి కి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన మమతా బెనర్జీ.. తన తోటి కాంగ్రెస్ పార్టీ సాయం కోరారు. దీంతో మమతా బెనర్జీని ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు సోనియాగాంధీ. ముఖ్యంగా టీఎంసీ విలీన ప్రతిపాదనను మమతా బెనర్జీ ముందు పెట్టారు. దీనికి ప్రతిగా మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుకు భరోసా లభించినట్లు తెలుస్తోంది. బిజెపి నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు.. విపక్షాల ఉమ్మడి బలాన్ని పెంచే దిశగా సోనియా గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు కొంత సమయం మమతా బెనర్జీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
-
కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో చర్చలు..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, పెరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా గాంధీ స్వయంగా మమతా బెనర్జీకి ఫోన్ చేసి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని.. ఆలోచించుకునేందుకు కొంత సమయం కావాలని ఆమె కోరినట్లు ప్రచారం సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే సోనియా గాంధీ.. మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆఫర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం నడుస్తోంది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ.. మమతా బెనర్జీ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని విభేదించి తృణమూల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసిన.. మమతా బెనర్జీ తిరిగి మాతృ సంస్థకు దగ్గర కావడం జాతీయ రాజకీయాల్లో సరికొత్త హాట్ టాపిక్.