కేరళలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి, వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇడుక్కి జిల్లా వాగమండ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ ఇంటిపై మట్టి పెళ్లలు పడటంతో ప్రభాకరన్ నాయర్ అనే వ్యక్తి మృతి చెందారు. ఇదే జిల్లాలోని అదూర్మల ప్రాంతంలో మరో వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అతని కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
భారీ వర్షాల ప్రభావంతో కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రహదారులపై మట్టి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
కొట్టాయం జిల్లాలోని పయ్యనితోటం ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జోసెఫ్ అనే యువకుడు మృతి చెందగా, అతని తల్లి కోసం శిథిలాల కింద సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
also read: భారీ వర్షాల ముప్పు.. చెట్టెక్కిన యువకుడు
