Homeతెలంగాణమూడు రోజుల ఉత్కంఠకు తెర!

మూడు రోజుల ఉత్కంఠకు తెర!

•గులాబీ పార్టీ కీలక నేత బాల్క సుమన్ అరెస్ట్
•తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:- తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసనల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. గత మూడు రోజులుగా బాల్క సుమన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ వచ్చారు. ఎట్టకేలకు తెలంగాణ భవన్లో ఉన్నారని తెలుసుకొని అరెస్ట్ చేశారు.

వివాదాస్పద కామెంట్స్..
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా బాల్క సుమన్ మాట్లాడారు. ప్రజలతోపాటు టిఆర్ఎస్ శ్రేణులు ఉగ్రరూపం దాల్చాలని.. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలని.. రైలు పట్టాలు పోసేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా.. ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత మూడు రోజులుగా సుమన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పోలీసులకు దొరకకుండా బంజారాహిల్స్ లోని భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు తెలంగాణ భవన్ ను చుట్టుముట్టి.. ఆయన బయటకు రాకుండా పహారా కాసారు. శనివారం లోపలికి వెళ్లి అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగింది.

ఉదయం నుంచి హైడ్రామా..
తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉదయం నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. మధ్యాహ్నం పోలీసులు లోపలికి వెళ్తారు అన్న తరుణంలో బాల్క సుమన్ స్వయంగా తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే వేచి ఉన్న పోలీసుల వాహనం ఎక్కే ముందు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తోందని.. ఇటువంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం ఆయన పోలీసులతో కలిసి వాహనంలో వెళ్లడంతో గత మూడు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు