శ్రీకాకుళం, క్రైమ్‌మిర్రర్: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, జూన్ నెలాఖరు నాటికి విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జూన్‌లో ఎయిర్‌పోర్టు పనులు ముగియనుండటంతో, జులై నుంచి ఇక్కడి నుంచి అధికారికంగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయిఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముందే అంతర్జాతీయ విమానయాన సంస్థలు భోగాపురం నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ చౌక ధరల విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఈ ఏడాది జులై 8వ తేదీ నుంచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తమ విమాన సర్వీసులను నడుపుతామని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనితో ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఉత్తరాంధ్రకు సింగపూర్‌తో అంతర్జాతీయ కనెక్టివిటీ లభించనుంది.భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. విశాఖపట్నం ఐటీ, ఫార్మా రంగాలు మరింత వృద్ధి చెందడానికి, పర్యాటక రంగం విస్తరించడానికి ఈ ఎయిర్‌పోర్టు కీలక మైలురాయిగా మారనుంది.
గడువులోగా పనులన్నీ పూర్తి చేసి జులైలో విమానాలను పరుగులు పెట్టించడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ముమ్మరం చేసింది. ఉత్తరాంధ్రలోని ఫార్మా, ఆక్వా, ఐటీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఇక్కడ ఒక భారీ అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.కాగా ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ఎయిర్‌పోర్ట్ మొదటి దశ పూర్తి కాగానే, ఇక్కడి నుంచి ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రన్‌వే పొడవు సుమారు 3.8 కిలోమీటర్లు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానమైన ఎయిర్‌బస్ ఏ380 లాంటి జంబో జెట్ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వగలవు.
జూలై నుంచి సింగపూర్…
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా, మరికొన్ని వారాల్లోనే ఈ ఎయిర్‌పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి రానుందనే వార్త ప్రాంత ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. జూలై తొలి వారంలోనే విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జూలై 5న ప్రారంభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జూలై 8 నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించేందుకు అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయని చెబుతున్నారు.
ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ప్రత్యేకతగా మారింది. జూలై 4న అల్లూరి జయంతి ఉండటంతో, మరుసటి రోజే విమానాశ్రయం ప్రారంభం జరగడం ఉత్తరాంధ్ర ప్రజలకు భావోద్వేగపూరితమైన అంశంగా మారుతోంది. ఒకవైపు అల్లూరికి ఘన నివాళి, మరోవైపు ప్రాంత అభివృద్ధికి భారీ అడుగు అనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం తర్వాత విశాఖపట్నం విమానాశ్రయం భవిష్యత్తుపై కూడా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్ నేవీ ఆధీనంలోని ప్రాంతంలో ఉండటంతో విస్తరణకు పరిమితులు ఉన్నాయి.
ఈ కారణంగానే కొత్త అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అవసరం చాలా కాలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. భోగాపురం ప్రారంభమైతే ప్రధానంగా అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు అక్కడికే మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు కొత్త విమానాశ్రయానికి సంబంధించిన సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహా మరికొన్ని సంస్థలు జూలై నుంచి భోగాపురం నుంచే సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం.
దీంతో ప్రయాణికులు కూడా కొత్త ఎయిర్‌పోర్ట్‌కు అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ చుట్టూ మరో రాజకీయ చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్‌పోర్ట్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఆయన ఈ ప్రాజెక్ట్ పురోగతిని దగ్గరుండి పర్యవేక్షించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న వార్తలతో అప్పటికీ ఆయన అదే శాఖలో కొనసాగుతారా లేదా అనే చర్చ మొదలైంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వస్తుందని భావిస్తున్నారు