Homeతెలంగాణతెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా పర్యాటక అభివృద్ధి: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా పర్యాటక అభివృద్ధి: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని చారిత్రక సంపదను కాపాడుతూనే సందర్శకులను ఆకర్షించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌తో కలిసి పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు.

చారిత్రక కట్టడాల సందర్శన

మంత్రి జూపల్లి కృష్ణారావు షేక్‌పేటలోని కుతుబ్‌షాహీ టూంబ్స్.. గోల్కొండ కటోరా హౌస్.. ఖజానా బిల్డింగ్‌ ఆర్కియాలజికల్‌ మ్యూజియంలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ అద్భుత వారసత్వ కట్టడాలకు నిలయమని ఆయన కొనియాడారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.

పునరుద్ధరణ పనులపై సమీక్ష

కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్ సందర్శనలో భాగంగా వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌లో కేసులు ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

గోల్కొండ రోప్‌ వే ప్రాజెక్టు

పర్యాటకుల ప్రధాన ఆకర్షణగా నిలిచే టూంబ్స్‌ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్‌ వే ప్రాజెక్టుపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అనుమతుల దశలో ఉందని అధికారులు వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఆక్రమణల తొలగింపునకు ఆదేశం

కటోరా హౌస్‌ ప్రస్తుత స్థితిపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అది మురికి కూపంగా మారిందని.. వెంటనే పూడికలు తొలగించి పర్యాటక ప్రాంతంగా మార్చాలని చెప్పారు. మ్యూజియం వెనుక ఉన్న ఆక్రమణలతో పాటు కటోరా హౌస్‌ వద్ద ఉన్న కబ్జాలను పోలీసుల సాయంతో వారం రోజుల్లో తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

హస్తకళలకు ప్రోత్సాహం

గోల్కొండ కోటకు వచ్చే పర్యాటకుల కోసం చార్మినార్‌ లాడ్‌ బజార్‌ తరహాలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని మంత్రి ప్రతిపాదించారు. తద్వారా చేనేత కార్మికులు.. హస్త కళాకారులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఖజానా బిల్డింగ్‌ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని.. అక్కడ చేనేత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి.. పురావస్తు శాఖ డైరెక్టర్‌ అర్జున రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ: తీవ్ర విషాదం…గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఐదుగురు స్పాట్‌లోనే…! మ‌రో 12 మంది ప‌రిస్థ‌తి విషమం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు