- ఇద్దరు మంత్రులకు జాతీయ కార్యవర్గంలో బాధ్యతలు
- రెండు రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా నియమించే అవకాశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అధినాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల వరకు ఇదే పట్టును కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కర్ణాటకలో సీఎం మార్పు అని తెలుస్తోంది. ఇక తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మార్పు పై కొత్త చర్చ మొదలైంది. క్యాబినెట్ ప్రక్షాళనతో పాటు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కసరత్తు చేస్తోంది.
వచ్చే ఏడాది చాలా రాష్ట్రాలకు ఎన్నికలు..
వచ్చే ఏడాది చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ జాబితాలో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు బలమైన నాయకులను ఇన్చార్జులుగా పెట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను తెలంగాణ మంత్రివర్గంలోని ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి.. ఆయా రాష్ట్రాల ఇన్చార్జ్ బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మరింత గట్టిగా..
కోమటిరెడ్డితో పాటు ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలు. అందులో ఒకరికి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి తదుపరి సమావేశం హైదరాబాదులో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. ఎంత మాత్రం అందుకు అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా క్యాబినెట్ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డికి హై కమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను మార్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తున్న ఈ ఆలోచనల పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో విస్తృతమైన చర్చ అయితే జరుగుతోంది.