-
అంతర్రాష్ట్ర వివాదంగా మారే అవకాశం
-
వన్యప్రాణులకు ఆటంకం
-
కర్ణాటక ప్రభుత్వం సీరియస్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడులో టివికే ఎమ్మెల్యేలు, మంత్రులు తరచూ వివాదాస్పద అంశాల్లో కూరుకుపోతూనే ఉన్నారు. తాజాగా సామాజిక న్యాయశాఖ మంత్రి వన్ని అరసు వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో అటవీ సంరక్షణ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అభయారణ్యాల్లో వన్యప్రాణులను వెంబడించడం ఆయనను చిక్కుల్లో పడేసింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వులో ఒక అడవి ఏనుగుకు అత్యంత సమీపంగా వెళ్ళిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. వీడియోలో కనిపించిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.
తరచూ వివాదాలు…
మరోవైపు తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వులోను మంత్రి వన్ని అరసు సఫారీ వాహనాల నుంచి కిందకు దిగి ఒక పులిని వెంబడిస్తూ రీల్స్ చిత్రీకరించిన మరో వీడియో దుమారానికి దారితీసింది. అభయారణ్యాల పరిధిలో వాహనాల నుంచి బయటకు రావడం, వన్యప్రాణులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ.. ఒక బాధ్యతయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడంపై పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు చిన్న తప్పు చేస్తే కేసులు నమోదు చేసి అటవీ శాఖ అధికారులు.. మంత్రి వెంట ఉండి మరి నిబంధనలు ఉల్లంఘించడానికి సహకరించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మారని వైఖరి…
ముఖ్యమంత్రి విజయ్ సొంత పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న వారి వైఖరిలో మార్పు రావడం లేదు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు క్రమశిక్షణతో మెలగాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే లేదా వివాదాలకు దారి తీసే పనులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తూ వచ్చారు. అయినా కొందరి వైఖరిలో మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మంత్రి అరసు పదేపదే ఇలాంటి వివాదాలు చిక్కుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోవైపు కర్ణాటక అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి అయితే అటవీ చట్టాలు అందరికీ సమానమే.. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పడం ఈ వ్యవహారం తీవ్రతకు అర్థం పడుతోంది. సోషల్ మీడియాలో ప్రచారం కోసం మంత్రి చేసిన ఈ అతి ఇప్పుడు అంతర్రాష్ట్ర వివాదంగా మారే అవకాశం ఉంది.
