క్రైమ్ మిర్రర్ : దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులపై అధికారులు బలవంతపు చర్యలకు దిగకూడదని ఆదేశించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సూచనలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. నేరపూరిత నేపథ్యం లేని మైనర్లు, విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వారిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తులకు ఇదే రక్షణ వర్తించదని స్పష్టం చేసింది.
నిరసనల సమయంలో పోలీసులు తీసుకున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు కోర్టు అవకాశం కల్పించింది. తమ వాదనలు, ఆధారాలను సమర్పించవచ్చని తెలిపింది. ఇక ఈ ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, డ్రోన్ కెమెరా రికార్డులు, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసులు సేకరించిన నిరసనకారుల డిజిటల్ సమాచారాన్ని బహిరంగంగా విడుదల చేయరాదని స్పష్టం చేసింది.
నిరసనకారుల వ్యక్తిగత వివరాలు, ప్రైవేట్ డేటాను ఎలాంటి అనుమతి లేకుండా ప్రచురించకూడదని కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గోప్యతను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నిరసనల సమయంలో పెల్లెట్ గన్స్ వినియోగంపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విద్యార్థులు, పోలీసులకు జరిగిన గాయాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ దర్యాప్తు కోసం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు సంబంధిత ఆధారాలను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ సోదరుడు మృతి
