క్రైమ్ మిర్రర్ : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాపులపాడు మండలం బొమ్మలూరు సమీపంలో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ సోదరుడు నున్నా సురేశ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో, విద్యాసంస్థల వర్గాల్లో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నున్నా సురేశ్ తన భార్యతో కలిసి విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మలూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న నున్నా సురేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు.
also read : విద్యార్థిని శివాని మృతి తీవ్ర విచారం కలిగించింది …! సీఎం చంద్రబాబు…
