టీచర్ తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు ఆగ్రహం!

0
160
Supreme Court Clears Teacher Of Abetment Charge Says Scolding Alone Not Suicide Trigger
Supreme Court Clears Teacher Of Abetment Charge Says Scolding Alone Not Suicide Trigger

Supreme Court: ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడం, దండించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులను గాడిలో పెట్టేందుకే కఠినంగా వ్యవహరిస్తారు తప్ప, వారి మీద వ్యక్తిగత కోపం ఏమీ ఉండదన్నారు. మద్రాసు హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఉపాధ్యాయుడిపై కేసును కొట్టివేసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

“విద్యార్థులు ఉత్తమ పౌరులుగా మారాలంటే ఉపాధ్యాయుడి బెత్తం దెబ్బలు తినక తప్పదు. చదువుల్లో వెనుకబడినా, క్రమశిక్షణ తప్పి ప్రవర్తించినా, టీచర్ తన చేతిలో కర్రకి పని చెప్తాడు. అలాగని, విద్యార్థుల మీద తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం ఉండదు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లల మాదిరిగానే చూసుకుంటారు. వారంతా సన్మార్గంలో వెళ్లాలనే కోరుకుంటారు. టీచర్ మందలించడం ఆత్మహత్యకు పురికొల్పడం కాదు. అలా ఊహించడం కూడా సరికాదు” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

తమిళనాడు కేసుపై కీలక తీర్పు   

తమిళనాడుకు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఓ పాఠశాలకు చెందిన, హాస్టల్‌ ఇన్‌ చార్జి గా ఉన్న ఉపాధ్యాయుడికి ఓ విద్యార్థి మరో విద్యార్థి మీద కంప్లైంట్ చేశాడు. సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని పిలిచి మందలించాడు. ఉపాధ్యాయుడి మాటలకు మనస్థాపం చెంది, సదరు విద్యార్థి గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు పెట్టారు. తాను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలను కొట్టివేయాలని ఉపాధ్యాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.ఈ కేసు విచారణను చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభిప్రాయపడింది. ఉపాధ్యాయుడు దాఖలు చేసిన కేసును కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఈ కేసుపై జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా  బెంచ్‌ విచారణ జరిపింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. విద్యార్థులు బాగుండాలనే ఉపాధ్యాయులు కోరుకుంటారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Read Also: ముందే రుతుపవనాలు, మేలోనే వానలు.. ఏంటీ వింత వాతావరణం?