ఆదిలాబాద్, క్రైమ్ మిర్రర్ :బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా టీనేజ్ గర్భాల నివారణ, ఎలోప్‌మెంట్, డ్రగ్స్ నివారణ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత “డ్రగ్స్‌కు దూరంగా – చదువుకు దగ్గరగా” ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని, ఇలాంటి అనర్థాలపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు, కేసుల బారిన పడకుండా పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న బాలల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్.డా.జైసింగ్ రాథోడ్, డా. సాధన,ప్రిన్సిపల్ లలిత, ఇతర అధికారులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.