Homeట్రావెల్శివరాత్రికి రేపటి నుండి 2,243 ప్రత్యేక బస్సులు...!

శివరాత్రికి రేపటి నుండి 2,243 ప్రత్యేక బస్సులు…!

• ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు
• 2,243 స్పెషల్ బస్సులు నడపనున్నటీజీఎస్ఆర్టీసీ
• ప్రయాణికుల నుంచి 50 శాతం అదనపు చార్జీలు వసూలు
• మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహా శివరాత్రి ఒకటి. పరమశివుడిని ఆరాధించడానికి ఈరోజు ప్రత్యేకమైనది. శివరాత్రి రోజు శివాలయాలు “ఓం నమః శివాయ” అనే నామస్మరణతో మార్మోగుతాయి. కాగా, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది.

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ స్పెషల్ బస్సులు ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడురోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రాష్ట్రం నుంచి అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 781 బస్సులను కేటాయించారు. వేములవాడకు 416, కీసరగుట్టకు 326 బస్సులు, ఏడుపాయలకు 249 బస్సులు, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడపనుంది. వీరిటితోపాటు కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి బస్సులు బయలుదేరతాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

*స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు, మహాలక్ష్మి పథకం వర్తించదు..!

శివరాత్రి స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూళ్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం.. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50శాతం ఎక్కువగా వసూలు చేయనున్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ తీసుకొని ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు