క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సింగరేణిలో క్వాలిటీ యంత్రాలు లేవు.. వారి భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు వైఖరిని ఎండగడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అదే సమయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సింగరేణి కార్మికుల క్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన కవిత.. ప్రస్తుతం సింగరేణిలో కార్మికులకు కనీస నాణ్యత కలిగిన యంత్రాలు (క్వాలిటీ మెషినరీ) అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే బొగ్గు గని కార్మికుల భద్రతను ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావే కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. తాము సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మంత్రి శ్రీధర్ బాబు కావాలనే తమ పర్యటనలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ, ఈ వ్యవహారం ద్వారా శ్రీధర్ బాబు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.