క్రైమ్ మిర్రర్, జాతీయం:- పవిత్ర అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులకు ఊరట లభించింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన యాత్రను అధికారులు శనివారం నుంచి తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం బల్తాల్ మార్గం ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు రహదారులు దెబ్బతినడంతో శుక్రవారం యాత్రను నిలిపివేశారు. అనంతరం అధికారులు, భద్రతా సిబ్బంది, రహదారి నిర్మాణ బృందాలు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాయి. రోడ్లను తిరిగి ప్రయాణానికి అనుకూలంగా మార్చడంతో బల్తాల్ మార్గంలో యాత్రను పునరుద్ధరించారు.అయితే పహల్గామ్ మార్గంలో మాత్రం యాత్ర ఇంకా నిలిపివేశారు. ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం కొనసాగుతోంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ మార్గంలో అనుమతులు ఇవ్వడం లేదు.
భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు వీరే?
ఇక జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై కూడా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భాగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాల్సిన పలువురు యాత్రికులను తాత్కాలికంగా అక్కడే నిలిపివేశారు. రహదారి పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత మాత్రమే వారిని ముందుకు పంపే అవకాశం ఉంది.జూలై 3న ప్రారంభమైన ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4.5 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మార్గాల్లో కూడా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే యాత్రను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామని వెల్లడించారు.ఈ నెలాఖరు వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులు, అధికారుల తాజా సూచనలు తప్పనిసరిగా తెలుసుకుని ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
మాస్కోలో భారీ పేలుడు కలకలం.. రెస్టారెంట్ బయట బాంబు ఘటనలో ముగ్గురు మృతి, 21 మందికి గాయాలు
