HomeజాతీయంRakesh Chauhan: భారత నావికుడి మృతదేహంలో అవయవాలు మాయం.. వెనెజువెలాలో అసలేం జరిగింది?

Rakesh Chauhan: భారత నావికుడి మృతదేహంలో అవయవాలు మాయం.. వెనెజువెలాలో అసలేం జరిగింది?

వెనెజువెలాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌ లోని డియోరియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల రాకేష్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత నిర్వహించిన పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆయన మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం, రాకేష్ మృతదేహంలో మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, రెండు మూత్రపిండాలు, ప్లీహం, క్లోమం, పేగులు లాంటి ప్రధాన అవయవాలు కనిపించలేదు. అంతేకాకుండా, మృతదేహంపై ముందే శస్త్రచికిత్స చేసినట్లుగా పెద్ద ఎత్తున కుట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. వైద్యుల ప్రకారం, అంతర్గత అవయవాలు లేకపోవడంతో రాకేష్ మరణానికి అసలు కారణాన్ని నిర్ధారించడం సాధ్యం కాలేదు. దీంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాకేష్ చౌహాన్ గత ఏడాది నవంబర్‌లో మర్చంట్ నేవీలో ఉద్యోగం కోసం వెనెజువెలాకు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా నౌకలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఆయన మరణించినట్లు కంపెనీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మొదట నౌకపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మరణించారని సంస్థ తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే మృతదేహం దాదాపు నెల రోజుల తర్వాత మాత్రమే భారత్‌కు చేరిందని వారు తెలిపారు.

భారత్‌కు వచ్చిన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో మెడ నుంచి నడుము వరకు 22 కుట్లు, తల వెనుక భాగంలో మరో 21 కుట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ప్రధాన అవయవాలు లేకపోవడంతో మరణానికి స్పష్టమైన కారణాన్ని చెప్పలేమని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (FSUI) కూడా స్పందించింది. రాకేష్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, భారత ప్రభుత్వం అలాగే వెనెజువెలాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని నిజాలు వెలికితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సంఘం డిమాండ్ చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు